బతుకు చిత్రాలను రంగుల్లో ఘనంగా ఆవిష్కరిస్తూ, తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంబరం-బతుకమ్మ పండగ. దసరా నవరాత్రుల సమయంలో బతుకమ్మ ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుకుంటారు. ఏటా భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ అమావాస్య) నుంచి విజయదశమి వరకూ తొమ్మిది రోజులపాటు ఆనందోత్సాహాల నడుమ తెలంగాణ ప్రాంత మహిళలు ఈ పండగను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
ఈ తొమ్మిది రోజుల్లో తమ ఇళ్ల ముంగిట రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది పూజలు చేస్తారు. బతుకమ్మ అలంకరణలో తంగేడు పూలది ప్రత్యేక స్థానం. చామంతి, గునుగు, జాజి, బంతి, జిల్లేడు, బీర, రుద్రాక్ష, గడ్డిపూలతో పాటు పలు రకాల పూలను వినియోగిస్తారు. వెడల్పుగా ఉన్న పళ్లెంలో మారేడు ఆకులు వేసి వాటిపై పూలను గోపురం ఆకారంలో తీర్చి దిద్ది బతుకమ్మలను తయారుచేస్తారు. పూలను వలయాకారంలో పేర్చాక, శిఖర భాగంలో గుమ్మడి పూలను ఉంచుతారు. ఈ పూల గోపురానే్న బతుకమ్మగా భావిస్తారు. పూల మధ్య తంగేడు పూల రెక్కలు పరిచి, తమలపాకులు పెట్టి కుంకుమ బొట్లతో అలంకరించిన పసుపు గౌరమ్మలను ఇంటి ముందు ఉంచి దీపాలు వెలిగిస్తారు. పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించిన పీటపై ముగ్గు వేసి బతుకమ్మను ఉంచి స్ర్తిలు ఆనందోత్సాహాల నడుమ పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతారు. బతుకమ్మకు సద్దుల నివేదన ముగిసిన అనంతరం తమ కోర్కెలు తీర్చాలని మహిళలు మనసారా మొక్కుకుంటారు. ప్రతినిత్యం తమ సంసారాలను కాపాడుతూ, సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని గౌరమ్మను మహిళలు ప్రార్ధిస్తారు.
ఒక్కో పువ్వేసి చందామామ..
సాయంత్రం వేళ ఇళ్ల ముంగిట బతుకమ్మలను ఉంచి మహిళలు చేసే సందడిలో పాటలదే పైచేయిగా కనిపిస్తుంది. ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ లయబద్ధంగా అడుగులువేసి వీరు పాటలు పాడతారు. ఆటపాటలు ముగిశాక గౌరీ దేవిని స్తుతిస్తూ బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ సంబరాలకు ముందు ‘బొడ్డెమ్మ పండగ’ను జరుపుతారు. బొడ్డెమ్మను బతుకమ్మ బిడ్డ అని భావిస్తారు. బతుకమ్మ పాటలు జానపద సంప్రదాయాల్ని గుర్తుకు తెస్తాయి. ఈ పాటల్లో చందమామ, ఉయ్యాల, కోలు, గౌరమ్మా వంటి పదాలు విధిగా ఉంటాయి. పల్లెసీమల్లో పొలం పనులు చేసుకుంటూ మహిళలు తమ కష్టాన్ని మరచిపోయేందుకు పాడే పాటలు బతుకమ్మ వేడుకల్లో వినిపిస్తాయి.
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి బీభత్సాలు, అంటు వ్యాధులు, కరవు కాటకాలు వచ్చినప్పుడు అందరినీ కాపాడే అమ్మ ‘బతుకమ్మ’ అని భావించి మహిళలు ఈ పండగను ఆచరించడం మొదలుపెట్టారని పెద్దలు చెబుతారు. గృహిణులు తాము దీర్ఘ సుమంగళిగా ఉండాలని, యువతులు తమకు మంచి భర్తలు లభించాలని గౌరీదేవిని ఆరాధిస్తారు. బతుకమ్మ సంబరాల్లో శ్రమజీవుల పాటలతో పాటు అత్తాకోడళ్ల పాటలు, పురాణ స్ర్తిల కథలను వివరించే పాటలు పాడతారు. పాటలే కాదు, బతుకమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించడంలోనూ మహిళలు పోటీ పడతారు. గోధుమ, సజ్జ, బెల్లం, పెసర్లు, నువ్వులు ముద్దగా దంచి తయారుచేసిన వంటకాలను బతుకమ్మలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ నైవేద్యాన్ని అందరికీ పంచిపెడతారు. ఎలాంటి భేద భావాలు కనిపించక పోవడం బతుకమ్మ సంబరంలో మరో గొప్ప విశేషం. అంతా సమానమేనన్న భావన ఈ పండగలో ప్రతిఫలిస్తుంది. పేద, గొప్ప అనే తారతమ్యాలు గానీ, కులాల పట్టింపులు గానీ కనిపించవు. ఏ కులానికి చెందినా, పేద వర్గాలకు చెందినా గొప్పగా పాటలు పాడే మహిళలను ఆదరిస్తారు.
పురాణ గాథలెన్నో..
రాక్షసుడైన మహిషాసురుడిని వధించే సమయంలో దుర్గామాత సొమ్మసిల్లి పడిపోగా, స్ర్తిలు ఆమెను ‘బతుకమ్మా..’- అని పాటలు పాడి మేల్కొలిపారన్నది పురాణ కథనం. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజున ఈ సంఘటన జరిగింది గనుక ఏటా అదే రోజున బతుకమ్మ పండగను ఆచరించడం ఆనవాయితీగా మారిందని పెద్దలు చెబుతుంటారు. శ్రీ మహాలక్ష్మీ మాత బతుకమ్మగా అవతరించిందని భక్తుల నమ్మకం. ఈ పండగపై మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. చోళ దేశాధిపతి అయిన ధర్మాంగుడు, అతని ధర్మపత్ని సత్యవతి సంతానం కోసం తపస్సు చేయగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై వారి ఇంట జన్మిస్తానని వరమిచ్చిందట. ఈ దంపతులకు అంతకుముందు పుట్టిన నూరుగురు కుమారులు యుద్ధంలో మరణించారని, ఈ కారణంగానే తమ కుమార్తె నిండు నూరేళ్లు జీవించాలని ‘బతుకమ్మ’ అని పేరుపెట్టారని చెబుతారు. యుక్తవయసు వచ్చాక వీరి కుమార్తెను చక్రాంకుడనే రాజు రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు పెళ్లాడినట్లు పురాణ గాథ.
‘పోయి రావమ్మ.. గౌరమ్మా’..
తొమ్మిది రోజులపాటు కోలాహలంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు దుర్గాష్టమి రోజున పరిసమాప్తమవుతాయి. ఈ సంబరంలో ప్రధానమైనది చివరి రోజున జరిగే ‘సద్దుల బతుకమ్మ’ ఉత్సవం. పల్లెల్లో అయితే ఈ సందర్భంగా చెరువునుంచి మట్టిని తెచ్చి ఇంటి ముందు ఒక గద్దెలా వేసి దానిపై వెంపలి మొక్కను నాటుతారు. మహిళలు బతుకమ్మలను, సద్దులను తీసుకుని వచ్చి ఆ మొక్క చుట్టూ వలయాకారంలో అమరుస్తారు. వయో భేదం లేకుండా మహిళలు ఉత్సాహంగా అడుగులు వేస్తూ ఉయ్యాల పాటలు పాడతారు. పాటలు పాడడం ముగిసాక బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తూ ‘పోయి రావమ్మ గౌరమ్మా’ అని అంతా గళం కలుపుతారు. పసుపు కుంకుమలను, సద్దులను మహిళలు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటారు. ఇది ఐక్యతా భావానికి ప్రతీకగా నిలుస్తుంది. బతుకమ్మల నిమజ్జనం సమయంలో చెరువు నీళ్లపై మనోహర దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. కాంతులీనే తారలతో చీకటి వేళ ఆకాశం ఎంత అందంగా కనిపిస్తుందో- రంగురంగుల బతుకమ్మలతో, దీపాలతో చెరువులన్నీ కమనీయ దృశ్యాలకు వేదికలవుతాయి.
బతుకమ్మ అంటే పార్వతి అని, ఆమెకు పూలంటే ఎంతో ప్రీతిపాత్రం కనుక మహిళలు వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఇళ్లముంగిట పూల పరిమళాలు గుబాళిస్తాయి. ఈ పండగలో జానపద కళలకు పెద్ద పీట వేయడం కనిపిస్తుంది. ఆటపాటలతో పాటు కొన్నిచోట్ల సాంస్కృతిక ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేస్తారు.