ఆమె వెళ్లిన కొద్ది క్షణాలవరకూ అలానే నిల్చుండిపోయాడు పవన్. నవీన్ వచ్చి భుజం తట్టేసరికి తేరుకున్నాడు.
‘‘ఏమిటీ గర్ల్‌ఫ్రెండా? బాగా లాఠీఛార్జి చేసిందనుకుంటాను!?’’ అన్నాడు నవీన్.
ఏ సమాధానమూ చెప్పలేదు గానీ భారంగా కణతలు నొక్కుకున్నాడు పవన్.
అఖిల అంటే తనకు చాలా ఇష్టం. ఆమె గలగలా మాట్లాడుతుంటే మలయమారుతం వీచినట్లుంటుందతడికి. ఆకర్ణాంత నేత్ర యుగళం అని కవులు వర్ణించినట్లు, బాపు ముగ్థ క్రీగంట చూసే నేత్రాల్లా అఖిల కళ్లంటే అతడికి చాలా చాలా ఇష్టం. ఆమె చీరలో ఉన్నా, చుడీదార్‌లో ఉన్నా మరే డ్రెస్సులో ఉన్నా అతడి కంటికి అందగానే అనిపిస్తుంది.
****
‘‘అఖిల అంటే నాకు చాలా ఇష్టం...’’ భోజనం చేసి హాల్లో రిలాక్స్‌గా కూర్చుని టీవీలో న్యూస్ చూస్తున్న నవీన్‌తో అన్నాడు పవన్ తను చెప్పబోయేదానికి ఉపోద్ఘాతంలా.
అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది.
శిల్పారామం నుంచి వచ్చిన తరువాత అఖిలగురించి తనను నవీన్ అడుగుతాడేమోననుకున్నాడు పవన్. కానీ నవీన్ ఏమీ అడుగలేదు. అతడు అడక్కపోయినా తను చెప్పాలనుకున్నాడు.
టీవీ వాల్యూమ్ తగ్గించాడు నవీన్. పవన్‌వైపు తిరిగి కూర్చున్నాడు.
‘‘హైస్కూల్ దగ్గర్నుంచి కాలేజీ వరకూ నేనూ అఖిలా క్లాస్‌మేట్స్‌మి. బి.కాం అయ్యాక తను ఎం.సిఎ చేసింది. నేనక్కడితో ఆపేసి ట్యూషన్లు, కానె్వంట్లలోనూ, అక్కడా, ఇక్కడా చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. అలాగే ప్రైవేటుగా ‘లా’ చేశాను. అఖిలతో హైస్కూలులో వట్టి స్నేహం మాత్రమే. జూనియర్ కాలేజీలో, డిగ్రీలో స్నేహం ముదిరి ప్రేమగా మారింది. డిగ్రీలో అయితే రోజులో ఒక్కసారైనా ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాడిని. ఆమె ఎంసిఏ చేస్తున్నప్పుడూ అంతే రోజులో ఒక్క పావుగంటయినా ఆమెతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోయినట్లుండేది. ప్రేమలో ఇంత ఉన్మాదం ఉంటుందని బహుశా నాకప్పుడే అర్థమయ్యింది...
‘‘మా ఇద్దరి విషయం మా ఫ్రెండ్స్‌కి సరేసరి! మా ఇంట్లోనూ తెలిసిపోయింది. నాన్న, అమ్మ మందలించారు. వాళ్లకి మనకి కుదరన్నారు. వాళ్లంతస్తుకి మనం సరితూగలేగమన్నారు. పైగా వాళ్ల శాఖ వేరు మన శాఖ వేరన్నారు. ఈ శాఖాభేదాలేంటో నాకర్థం కాలేదు. కులాలతో, మతాలతో కుమ్ములాడుకుని చస్తున్నాం. అది చాలదా అనుకున్నాను...
‘‘మా విషయం అఖిల ఇంట్లోనూ తెలిసిపోయింది. వాళ్లూ ఆమెను మందలించారు. వాళ్ల నాన్న డబ్బున్నవాడు. పలుకుబడి ఉన్నవాడూను. ఓ రోజు నేను ఎక్కడికో వెళ్లి వస్తున్నాను నడుచుకుంటూ. ఊరు బయట ఇంచుమించు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. నా ప్రక్కన కారు ఆగింది. అందులోంచి అఖిల నాన్నగారు దిగారు. సహజంగానే నేను కంగారు పడ్డాను. ‘నువ్వు జగన్నాధం మాస్టర్ కొడుకువి కదూ’- అనడిగాడు. అవునని తలూపాను. ‘మా అమ్మాయి అఖిల నువ్వు చనువుగా ఉంటున్నారని విన్నాను. ఫ్రెండ్షిప్ వరకూ నాకభ్యంతరం లేదు. కాని, అంతకుమించి మీరిద్దరూ ముందుకెళ్లారని తెలిసింది నాకు. మా అమ్మాయికి చెప్పాను. నీకూ చెబుతున్నాను. ఇక్కడితో ఈ వ్యవహారాలు కట్ చెయ్యండి. లేకపోతే నేను కఠినంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అలా జరిగితే మీ కుటుంబం తలెత్తుకోకుండా చేస్తాను. ఇంకిక్కడ మీరు బతికి బట్టకట్టలేరు.. ఇది వార్నింగ్ అనుకున్నా, బెదిరింపు అనుకున్నా ఎలా అనుకున్నా నీ ఇష్టం. మీ కుటుంబం ప్రశాంతంగా బతకాలనుకుంటే అఖిలతో నీ తిరుగుళ్లు వగైరా కట్ చెయ్యి...’’ అనేసి ఆయన కారెక్కి వెళ్లిపోయారు...
‘‘ఇది సినిమా కాదు. నిజ జీవితం. సినిమాలో ప్రేయసి కోసం హీరో ఎన్ని సాహసాలైనా చేస్తాడు. ప్రేయసిని లేవదీసుకునిపోయి అడవిలో కాపురం పెట్టేసి పుల్లలుకొట్టి బతికేస్తాడు.. కానీ, మాది మధ్య తరగతి కుటుంబం. రెక్కల కష్టంమీద బతుకుతున్న కుటుంబం. నాలుగైదురోజులు నాలో నేను సంఘర్షణకు గురయ్యాను. చివరికి ఆమెకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నాను. మా నాన్న పట్టుబట్టి నన్నిక్కడకి ఉద్యోగానికి పంపించడానికి కారణం కూడా అఖిలకి నన్ను దూరంగా ఉంచాలనే... కానీ జరిగింది మరోలా!’’ చెప్పడం పూర్తయ్యిందన్నట్లు తలక్రింద చేతులు పెట్టుకుని చాప మీద అలా వెల్లకిలా పడుకుండిపోయాడు పవన్.
‘‘అఖిలని నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు, ఆమె నిన్ను నిలదీస్తున్నప్పుడు నేనూహించాను, మీ ఇద్దరిమధ్యా ఏదో ఉందని. నా ఊహ కరెక్టయ్యిందన్నమాట...’’ నవీన్ అన్నాడు నవ్వుతూ.
‘‘కానీ, నాకు సమస్య మళ్లీ మొదటికొచ్చింది’’ సాలోచనగా అన్నాడు పవన్.
నవీన్ ఏమీ మాట్లాడలేదు. సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తుండిపోయాడు.
10
మధ్యాహ్నం రెండు గంటలు దాటుతోంది.
మీరాకృష్ణ అంతకుముందే భోజనం ముగించి హాల్లో సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది. ‘రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి... చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులతో సహా ఎనిమిదిమంది జవాన్ల మృతి... ప్రేమోన్మాది యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రియురాలు.. ఎసిబి వలలో ఇరిగేషన్ ఇంజనీరు..’ ఆ వార్తలు విని చిర్రెత్తుకొచ్చి న్యూస్ చానల్ మార్చేసింది మీరాకృష్ణ.
వేరే చానల్‌లో ఎన్టీఆర్ పాత జానపద సినిమా వస్తోంది. ఆ సినిమా ఎప్పుడో చిన్నప్పుడు టూరింగ్ టాకీస్‌లో చూసిన గుర్తుకొచ్చిందామెకు.
-ఇంకాఉంది