అపుడు వసిష్ఠుడు ఆ దశరాథవనీశ సుతుల వైవాహిక సంబంధమైన హోమాంతంలో అగ్నిహోత్రునకు ప్రదక్షిణం చేయించాడు. సప్తర్షులకి సేవలు చేయించి శ్రద్ధగా దీక్షతో అందరూ కూర్చున్నారు. వౌనులు, బ్రాహ్మణులు దీవించారు.
మరుసటి రోజు సదస్యం చేయించారు. సభాసదులందరూ పరమ సంతుష్టులై ఆశీర్వదించారు. వివాహ దినాలు నాలుగు అన్ని శోభనాలు ఈ విధంగా ఉండగా నేత్ర పర్వంగా చూసి, ప్రీతితో సూర్య వంశోత్తముడు దశరథ మహారాజుని, సముద్రుడులాగ గంభీరుడైన జనక మహారాజులను చక్కగా దీవించి కౌశికుడు హిమవత్పర్వతానికి వెడలిపోయాడు.
అంత మిథిలా నగర నాథుడు ఆనందంతో ఉప్పొంగి నిజ వైభవంతో- దశరథునితో కూడి భూసురులకు శ్రేష్ఠమైన ఆభరణాలు, వస్తమ్రులు ఒసగగా, వారు నిజ నివాసాలకు సాగిపోయారు. అర్థులకు కూడా అపరిమితంగా ధనరాసులిచ్చి పంపివేశారు.
పిదప కుమార్తెలకు ఉచిత రీతిని నీతులు కరపి నవరత్న భూషణాలు, చిత్ర విచిత్ర వస్త్రాలు, దాసీజనాన్ని అరణంగా ఇచ్చారు. అల్లుళ్లకు కరులు, హయాలు, రథాలు, భటులని ఒసగి, వసిష్ఠాది మునీంద్రులకి దశరథ మహారాజుకి అమూల్యాలైన మాణిక్య భూషణాలు ఇచ్చి పూజించి వినయ మధుర భాషణాలతో వీడ్కొలిపారు. దశరథ మహారాజు కొడుకుల్ని కోడళ్లని వెంట పెట్టుకొని అయోధ్యకి ప్రయాణమయాడు.
మార్గమధ్యంలో అపశుకునాలు తోచాయి. ప్రతికూలంగా వాయువులువీచాయి. నిరంతరంగా దుర్నిమిత్తాలు పొడచూపాయి. దశరథుడు కలత చెంది ‘‘మహర్షీ ఈ విధంగా దుశ్శకునాలు కానవస్తున్నాయేమిటి?’’ అని వసిష్ఠుని ప్రశ్నించాడు.
కుల గురువైన ఆ మహర్షి అనుకంపతో కనుగొని- ఒక నిశ్చయానికి వచ్చి ‘‘రాజా! ముందర ఒక గొప్ప భయం సంభవించి అంతలోనే తొలగిపోతుంది. భయం చెందకు అని వచించాడు. ఈ రీతిగా చెప్పుతూ ఉండగానే వాయువులు తీవ్రంగా వీచాయి. అంతటా పెనుధూళి కప్పివేసింది. ధూళి కప్పివేసిన వెంటనే గజాలు, అశ్వాలు, యోధులు, రౌతులు, విరథులై రథికులు నివ్వెరపోయారు. సేనలు నలుదెసలా చీకాకుపడ్డాయి. సూర్యకాంతి మాసిపోయింది.
అంత ముయ్యేడుమార్లు విజృంభించి క్షత్రియులను హతమార్చిన మహా పరాక్రమశాలి, గుబురుగా పెరిగిన పెంజడలలో కాపురమున్న గంగా జలంవలె నొసట చెమటలు స్రవింపగా, ఘోరాతిఘోరంగా మండు కుత్తుక విషాన్ని క్రూరులైన రక్కసిమూకలపయిన కోపించి ఉమిసిన శివుని ఫాల నేత్రమందు పెరిగి మండుతూన్న మంటను తన రెండు కన్నుల పంచి పెట్టుకొని వస్తూ ఉన్న పగిదిని కనుకెలకుల కెంపు రంగు పొసగ, లోని కోపాగ్ని మంటలు సుడులుగొను ఎర్రనిమంటలా అనే రీతిగాను, పెరిగి పెరిగి కెంజాదులు వెదచల్లే జడలు శిరమున వ్రేలాడగాను, భుజలక్ష్మిని పట్టుకొని అదే వికసించిన తామర పువ్వు అనేటట్లు గండ్రగొడ్డలి వీపున వ్రేలాడగాను చనుదెంచిన పరశురాముణ్ణి చూసి భయంతో కలగి దశరథుడు, వౌనీశ్వరులు భయం తొలగిపోయే అపాయంలేని ఉపాయాన్ని ఆలోచించడం ఆరంభించారు.
పరశురాముని భంగపాటు
శీఘ్రముగా ఆ పరశురాముడి కెదురుగా వెడలి అర్ఘ్యపాద్యములు కొంపోవగా, వాటిని కైకొనక రోషంతో దశరథుడిని దర్పంగా చూసి, ఆ దశరథ రాముడి ముందు నిలిచాడు. ఆ విధంగా తన ముందునిల్చిన భార్గవ రాముడిని ఆ దశరథ రాముడు కాంచి, తలయూచి, మెచ్చి, అత్యంతమూ భక్తితో నమస్కరించి, ఆతని కట్టెదుట ఒకింత భక్తితో నిలుచుండ వీక్షించి ‘‘నీవెంతగా మొక్కినా నిన్ను మన్నించి విడువను. రాజకుమారా! నాతో పోరుము’’ అని వక్కాణించాడు.
- ఇంకాఉంది