‘అమ్మ’ అనే ఈ తియ్యటి పదానికి పలు పర్యాయ పదాలున్నాయి. ప్రతి తల్లి తన పిల్లల ఆలన, పాలన కోసం ఎంతగానో శ్రమిస్తుంది. మన అమ్మలాగే జగత్తుకంతటికీ తల్లి అయిన జగదేకమాత దుర్గాదేవి కూడా మనందరి రక్షణ కోసం దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ కంటికి రెప్పలా కాస్తోంది. దుర్గాదేవి దుర్మార్గులను దనుమాడి మంచిని కాపాడిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని తరతరాలుగా మానవాళి ఎంతో వేడుకగా జరుపుకొంటూన్న పండుగే ‘విజయదశమి’. దుర్మార్గమును దూరం చేసిన శుభదినం కనుక దీనిని ‘దసరా’ అని కూడా పిల్వడం జరిగింది.
అట్టి ఈ తల్లి ముందు తలవంచి అమ్మా! నీవు మాకు సదా తోడు నీడై ఉండి బ్రోవుమని శరణు కోరుతూ ‘‘జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైల సుతే!!’’ అని మనసారా కీర్తిస్తూ రోజుకు ఒక్కొక్కటి చొప్పున ఆ దేవి తొమ్మిది అవతారాలను ఆవాహన చేసే ఈ తొమ్మిది రోజులూ నిత్య పూజలు ఆచరిస్తూ, నిత్య నైవేద్యాలు చేస్తూ సుమంగళీ వ్రతాలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, రకరకాల పండ్లు, తాంబూలాలు, పేరంటాలు, పసుపు కుంకుమలు, బొమ్మల కొలువులు మొదలైనవన్నీ ఈ నవరాత్రి వేడుకల్లో క్రమం తప్పక జరుగుతూంటాయి.
ఇట మనం గమనించదగ్గ మరో ముఖ్య విషయం కూడా ఒకటుంది. అది స్ర్తి శక్తికి పెద్దపీట వేసింది. అదేమిటంటే స్ర్తి మనస్సు పువ్వులా ఎంతో మృదువైనది. కానీ ఒక్కొక్కసారి ఆమె వజ్రమంత కఠినంగానూ మారిపోతుంది. సాధారణంగా స్ర్తి సుతిమెత్తనైన హృదయంతో పొంగులువారే ప్రేమ పరిమళంతో ముంచెత్తుతుంది. ఒకవేళ ఆమె అహానికి దెబ్బ తగిలినా, ఆమెకు చెందిన వారినెవరినైనా గాయపరిచినా ఒక్కసారిగా కర్కశంగా మారిపోతూంది. మట్టుపెడుతుంది. స్ర్తిలోని ఈ విభిన్న వ్యక్తిత్వాలు రెండూ రెండు ధృవాలు. ఆమె మొదటి ధృవం నుండి రెండో ధృవం చేరే దారి ‘సహనం’. వ్యక్తినిబట్టి ఈ రెండు ధృవాల మధ్యనున్న సహనపుదారి ఒక్కొక్కసారి కుంచించుకుపోతూ, విశాలమవుతూ ఉంటుంది. ఈ రెండు ధృవాలకు చిహ్నంగా అన్నపూర్ణ, కాళీమాత అనే దేవీ అవతారాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రజాకంటకులైన రాక్షసులను చంపడానికి ఆమె త్రిమూర్త్యాత్మకమయింది. దుష్టులను శిక్షించింది. విజయదశమి సందర్భంగా ఈ వృత్తాంతాన్ని గుర్తుచేసుకోవాలి. అందుకు కారణం గ్రహిద్దాం.
మధకైటబులు మరణించిన తర్వాత ముల్లోకవాసులను ముట్టడిస్తున్న మహిషాసురుడ్ని తుదముట్టించడానికి అంబ సమాయత్తమైంది. అమ్మ అనేనేకకశక్తులతో కూడి దివ్యశక్తిగా రూపొందింది. ఆ దివ్యశక్తి ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధాలతో సాక్షాత్కరించింది. అలా ప్రత్యక్షమైన ఆ తల్లి ఒక్కసారి చుట్టూ పరికించి చూసి మహా భయంకరంగా వికటాట్టహాసం చేసింది. ఆ ధ్వని అంబరమంతా నిండిపోయింది. ఒకేసారిగా దివ్యులంతా ఆ తల్లిని స్తుతించారు. భయంకరంగా చేసిన ఆ వికటాట్టహాస ధ్వనికి రాక్షసుల గుండె బద్దలైపోయినంత పనయింది. మహిషుడి ఆటల్ని సాగించకూడదన్న నెపంతో మహిషుణ్ణి పాశంతో బంధించింది మహాశక్తి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం ధరించాడు. భయంకరరావం గావించాడు. అంతలో చండిక మధుపానం గావించింది. ఒక్కసారిగా మహిషుణ్ణి కిందపడేలా తోసింది. పాదంతో తొక్కి పట్టింది. శూలంతో గుండెల్లో పొడిచింది. అంతలో మహిషుని ముఖం నుండి మరొక ఆకారం బయటికొచ్చింది. మహాదేవి ఆ రాక్షసాకారాన్ని చేతనున్న తన పదునైన ఖడ్గంతో సంహరించింది. ఆ రాక్షసుడి మస్తకం శరీరం నుండి నేలకూలింది.
దేవతలు పుష్పవృష్టి కురిపించారు. రాక్షసులు తోకముడిచారు. ముల్లోకవాసులు హాయగా ఊపిరిపీల్చుకొన్నారు. ఇలా దుష్ట రాక్షస నిర్మూలనచే భక్తి ప్రపత్తులతో దేవతా గణంతోపాటు ముల్లోకవాసులూ ఆ దేవిని కీర్తించి ఆ విజయోత్సవ దినాన్ని ‘విజయదశమి’ పండుగగా జరుపుకోవడం ఆచారమయింది.
మంచిమాట
english title:
vijayadasami
Date:
Tuesday, October 23, 2012