నిజామాబాద్, అక్టోబర్ 23: ఉపాధి హామీ పథకంలో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నట్టు నిర్ధారణ అయినప్పటికీ, నిధులు స్వాహా చేసిన అక్రమార్కుల నుండి వాటిని రికవరీ చేయలేకపోతున్నారు. చివరకు కలెక్టర్ ఆదేశించినా, నిధుల రికవరీ జాడ మాత్రం కానరావడం లేదు. గత రెండు మాసాల క్రితం ఉపాధి హామీ పథకం అమలు తీరుపై కలెక్టర్ సమీక్ష జరిపిన సందర్భంగా, పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టాయని గుర్తించారు. అయితే రికవరీ కనీసం పది శాతానికి కూడా చేరకపోవడాన్ని గమనించి సంబంధిత అధికారులపై తీవ్ర అసహనం వెళ్లగక్కారు. స్వాహారాయుళ్లకు రెండేళ్లు గడిచినా కనీసం నోటీసులు సైతం జారీ చేయకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వెళ్లగక్కారు. దుర్వినియోగమైన నిధుల రికవరీ కోసం ప్రత్యేక బృందాలను నియమించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. తాను ప్రతి శుక్రవారం నిధుల రికవరీ తీరును తప్పనిసరిగా సమీక్షిస్తానని, వారంవారం ప్రగతి కనబర్చాలని స్పష్టం చేశారు. ఇది జరిగి రెండు మాసాలు పూర్తయినప్పటికీ, నిధుల రికవరీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. సామాజిక తనిఖీ-2 నివేదికను అనుసరిస్తూ జిల్లాలో 1.07కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్టు తేలగా, 111మందిని బాధ్యులుగా పరిగణించారు. వీరిలో రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం 50మందికి మాత్రమే నోటీసులు జారీ చేశారు. 38మందికి సంబంధించిన పేర్లు, ఇతర వివరాలను కనీసం నివేదికలోనూ పొందుపర్చకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ స్వాహా అయిన నిధులను రాబట్టే ప్రయత్నం చేయాలని, అప్పటికీ అక్రమార్కులు ముందుకు రాకపోతే రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించాలని, అనంతరం అక్రమార్కుల ఆస్తులు, స్తిరాస్తుల వివరాలను సేకరించి, వారికి ఇతర సంస్థల ద్వారా ఏవైనా డబ్బులు రావాల్సి ఉన్నట్లయితే వాటిని నిలిపివేయించాలని కలెక్టర్ చేసిన ఆదేశాలు ఆచరణకు ఆమడ దూరంలోనే ఉండిపోతున్నాయి. కాగా, ప్రతీ మూడు మాసాలకోసారి జరిగే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాల్లోనూ ఇజిఎస్ నిధుల రికవరీ విషయమై ప్రజాప్రతినిధులు ఆక్షేపణలు తెలుపుతూ, సీరియస్‌గానే వార్నింగ్‌లు ఇస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. ఉపాధి పనుల్లో మేట్లు మొదలుకుని గ్రూప్ లీడర్లు, విఓలు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎఇలు, పోస్టల్ సిబ్బంది, చివరకు ఎంపిడిఓ స్థాయి అధికారుల వరకు అందినమేరకు నిధులను దండుకున్నారు. ఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమేయం లెక్కకు మిక్కిలిగా ఉన్నట్టు తేలింది. జిల్లాలో ఇజిఎస్ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఐదు విడతలుగా సామాజిక తనిఖీలు నిర్వహించారు. సోషల్ ఆడిట్ సందర్భంగా 3131 పనుల్లో 8.75కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ అయినట్టు నిగ్గు తేలింది. అయితే ఇందులో అధికారులు ఇప్పటివరకు కేవలం 1.35కోట్ల రూపాయల నిధులను మాత్రమే అతికష్టం మీద రికవరీ చేయగలిగారు. మిగిలిన అక్రమార్కులంతా అప్పనంలా ఇజిఎస్ నిధులను కైంకర్యం చేసి దర్జాగా తిరుగుతున్నారు. జిల్లాలో 673మంది ఫీల్డు అసిస్టెంట్లు 1.80కోట్ల రూపాయలను దిగమింగినట్టు గుర్తించగా, వాటిలో 16.80లక్షల రూపాయలను మాత్రమే రికవరీ చేశారు. 202మంది టెక్నికల్ అసిస్టెంట్లు 2.32కోట్లు కైంకర్యం చేయగా, కేవలం 10.33లక్షల రికవరీతోనే సరిపెట్టుకున్నారు. 469మంది సర్పంచ్‌లు 55.60లక్షల దుర్వినియోగానికి పాల్పడినట్టు తేలినా, 10.18లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి. 62మంది ఎ.ఇలు 70.31లక్షలు స్వాహా చేయగా, 18.32లక్షల రికవరీ జరిగింది. 296మంది పోస్టల్ ఉద్యోగులు 18.81లక్షలను కైంకర్యం చేయగా, 1.97లక్షల రికవరీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ పథకం అమలులో అనేక మంది అందినమేరకు కాసులు దండుకున్నట్టు సోషల్ ఆడిట్‌లో రుజువైనప్పటికీ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టలేకపోతున్నారు. ప్రజాధనాన్ని దిగమింగిన వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు వీలున్నప్పటికీ జిల్లాలో ఇంతవరకు ఏ ఒక్కరిపై కూడా ఈ తరహా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. కనీసం రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించి దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రాబట్టడంలోనూ విఫలమవుతున్నారు. స్వయంగా కలెక్టర్ ఆదేశించినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేకపోతోంది.
......................
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం తగదు
అధికారులకు ఎమ్మెల్యే యెండల హెచ్చరిక
కంఠేశ్వర్, అక్టోబర్ 23: ప్రజా సమస్యల పరిష్కారంలో సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని మిర్చికంపౌండ్‌కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వేలాది రూపాయల తప్పుడు బిల్లులు వేస్తున్నారని కొంతమంది పేదలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. మరికొంతమంది ప్రజలు తమ రేషన్ కార్డులు అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెండల మాట్లాడుతూ, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ అధికారులు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరైన విచారణ జరుపకుండానే అర్హులైన పేదల రేషన్ కార్డులు తొలగించడం సమంజసం కాదన్నారు. విద్యుత్ శాఖ అధికారులు గుడిసెల్లో నివసించే ప్రజలకు వేలాది రూపాయల తప్పుడు బిల్లులు వేయడం శోచనీయం అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫథకాలు అర్హులైన పేద ప్రజలందరికి అందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ మంగతాయరును కాలనీకి రప్పించి, మంచినీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. యెండల వెంట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు బిజెపి నాయకులు మల్లేష్‌యాదవ్, వెంకటేశం, మహేష్, రోషన్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదేశించినా ఫలితం శూన్యం
english title:
reco
Date:
Wednesday, October 24, 2012