నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 23: దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణ ప్రాంగణాలు సందడిగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో తమతమ సొంత ఊర్లలో వేడుకలు జరుపుకునేందుకు వచ్చీపోయే వారితో రైళ్లు, బస్సుల ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ తాకిడిని ముందుగానే గుర్తించిన ఆర్టీసీ, రైల్వే శాఖలు అదనపు ఏర్పాట్లు చేపట్టాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు, జిల్లా కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపారు. ఆర్టీసీ సంస్థ ఇటీవలే చార్జీల మోత మోగించడంతో రైల్వే శాఖకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఆర్టీసీ ప్రయాణం భారమైనా, పండుగ వేళ బస్సులు రద్దీగానే కనిపించాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అదనపు ట్రిప్పులతో పాటు అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుండి నిజామాబాద్‌కు రాజధాని సిటీ బస్సులను సైతం వినియోగించారు. ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాలు, జిల్లాలలో స్థిరపడిన వారంతా తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందోత్సాహాల నడుమ పండుగను జరుపుకునేందుకు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కేంద్రం నుండి ఆర్టీసీ, ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా తమ సొంత ఊర్లకు చేరుకున్నారు. రైల్వే శాఖ ప్రధాన రూట్లలో రైళ్లు నడపకపోవడంతో రైల్వే ప్రయాణికులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. ప్రతిరోజు 10 నుండి 15వేల మంది ప్రయాణికులు రైలు మార్గం ద్వారా ప్రయాణాన్ని సాగించి తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ వల్ల బోగీల్లో సీట్లు లేకపోయినా, నిల్చుండి మరీ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు బస్సుల రాకపోకల సమాచారాన్ని అందించారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుని తమతమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీకి దసరా పండగ గణనీయంగా ఆదాయం సమకూర్చింది. సాధారణ రోజుల్లో జిల్లాలోని ఆరు డిపోలలో ప్రతిరోజు 14 నుండి 20లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరేదని, దసరా సందర్భంగా అది రెట్టింపు అయ్యిందని అధికారులు తెలిపారు.
............................
ఎండుతున్న వరి పంట - ఆందోళనలో అన్నదాత
బాన్సువాడ, అక్టోబర్ 23: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సీజన్ ఆరంభం నుండే బాన్సువాడ ప్రాంత రైతులు ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. అడపాదడపా కురిసిన వర్షాలను నమ్ముకుని కాస్తంత ఆలస్యంగా వరి పంట వేసిన రైతులు, ప్రస్తుతం పెట్టుబడులను సైతం రాబట్టుకునే పరిస్థితి కనిపించక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత నెల రోజుల క్రితం రెండుమూడు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల ముందస్తుగా వేసిన వరి పంట నీట మునిగి అనేక మంది నష్టపోయారు. తీరా ఆలస్యంగా పంట వేసిన రైతులు ప్రస్తుతం సాగునీటి కోసం పరితపించాల్సి వస్తోంది. బోరుబావులను నమ్ముకుని పంటలు వేసిన రైతాంగానికి కరెంట్ కష్టాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. కనీసం నాలుగు గంటల పాటు కూడా విద్యుత్ సరఫరా అందించకపోవడం, అది కూడా రెండుమూడు విడతలుగా సరఫరా చేస్తుండడంతో పంటలకు సాగునీరందించడం దుర్లభంగా మారిందని వాపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన వరి పైరు కళ్లెదుటే ఎండుముఖం పడుతుండడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో దేవుడిపైనే భారం వేసి దిక్కులు చూస్తున్నారు. మరికొన్నాళ్లకే చేతికందే దశలో ఉన్న వరి పంట ఎండిపోతుండడాన్ని చూసి కన్నీటిపర్యంతం అవుతున్నారు. మండలంలోని చింతల్‌నాగారం శివారులో మంజీరా నదికి చేరువలోనే రైతులు వరి పంట వేసుకోగా, ఇప్పటికే ఈ ప్రాంతంలో 40ఎకరాల విస్తీర్ణంలో పంట ఎండిపోయింది. గత ఇరవై సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా నుండి వలస వచ్చిన వారు ఈ ప్రాంతంలో భూములను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. నక్కపోతు రాజు అనే రైతు తాను సొంతంగా సమకూర్చుకున్న భూమితో పాటు 14ఎకరాల స్థలాన్ని కౌలుకు తీసుకుని వరి పంట వేయగా, పరిస్థితి అనుకూలించకపోవడంతో పూర్తి విస్తీర్ణంలో పంట ఎండిపోవడంతో దిగాలు చెందుతున్నాడు. పంట సాగు కోసం చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయని, ప్రస్తుతం దిగుబడి చేతికందే అవకాశం లేనందున అప్పులను ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చివరి సమయంలో ఎండిపోయిందని పుట్టెడు దుఃఖానికి లోనవుతున్నారు. కరెంట్ కోత కారణంగా సాగు జలాలు అందక పంట ఎండిపోతోందని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. గింజ కట్టే దశలో సాగునీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, సరిగ్గా ఇదే సమయంలో కరెంట్ కోత తీవ్రమవడంతో తాము పంటలను కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. సాగునీరు అందని కారణంగా లక్షలాది రూపాయల విలువ చేసే పంటలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు కంటనీరు పెడుతున్నారు. ఎలాగైనా పంటలను కాపాడుకోవాలన్న తాపత్రయంతో మరికొంత మంది రైతులు కొత్తగా బోరుబావులను తవ్విస్తున్నప్పటికీ, చుక్క నీరు పడడం లేదు. ఫలితంగా రైతులు మరింతగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. చింతల్‌నాగారం ప్రాంతంలో పదుల సంఖ్యలో రైతులు రెండెకరాల నుండి నాలుగెకరాల విస్తీర్ణంలో పంటలు కోల్పోయారు. కొంతమంది జనరేటర్లను తెచ్చుకుని అదనపు వ్యయాన్ని భరిస్తూ పంటలను సాగు చేస్తున్నారు. జనరేటర్ల సహాయంతో సాగునీటిని అందించాలంటే రోజుకు 1500రూపాయల పైచిలుకు వ్యయం అవుతోందని, అయినప్పటికీ కనీసం పెట్టుబడులనైనా రాబట్టుకోవాలనే తపనతో ఈ ఖర్చును భరిస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. కాగా, మంజీరా ప్రాంతం నుండి పుల్కల్, చిట్టాపూర్ దామరంచ, వాజిద్‌నగర్, మద్దెల్‌చెర్వు తదితర ప్రాంతాల నుండి పెద్దఎత్తున ఇసుక రవాణా జరుగుతుండడం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయి బోరుబావులు ఎత్తిపోతున్నాయని, ఫలితంగా జనరేటర్లను ఉపయోగించినా సరిపడా నీరందక తాము ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విషయమై అధికారులు దృష్టిసారించి మంజీరా పరివాహక ప్రాంతం నుండి ఇసుక రవాణాను అరికట్టాలని, పంట చేతికందే దశలో ఉన్నందున సేద్యపు రంగానికి విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణ ప్రాంగణాలు సందడిగా మారాయి.
english title:
sandadiga
Date:
Wednesday, October 24, 2012