మోర్తాడ్, అక్టోబర్ 23: తెలంగాణాలో పాదయాత్ర చేయాలనుకునే పార్టీల నేతలు ముందుగా ప్రత్యేక రాష్ట్రం విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించాలని టిఆర్‌ఎస్ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మోర్తాడ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని పార్టీల నేతలు తెలంగాణ విషయంలో నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పర్యటన ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికి కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో దాగుడుమూతలు ఆడుతున్నాడని అన్నారు. స్పష్టమైన అభిప్రాయాన్ని తెలుపాలని కోరితే, అఖిలపక్షం పెడితే మాట్లాడతామని అనడం శోచనీయమని అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యల విషయంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేయడానికి అనుమతించని ప్రభుత్వం, ఇక్కడి ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోని వివిధ పార్టీల నేతల పర్యటనలకు మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తోందని ఎద్దేవా చేసారు. తెలంగాణ ఏర్పాటు పట్ల వైఖరిని ప్రకటించాలని కోరడానికి వెళ్లే తెలంగాణవాదులు, విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇవన్నీ కళ్లముందే జరుగుతున్నప్పటికీ, చంద్రబాబు మాత్రం తన నిర్ణయాన్ని తేటతెల్లం చేయకపోవడం ఆయన తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా బాబు తన నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ జిల్లాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా పాదయాత్రలు చేపడుతున్నారని, వారు కూడా ప్రత్యేక తెలంగాణపై తమ నిర్ణయాన్ని ప్రకటించాకే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయా నేతల పర్యటనలను ప్రజల ఆధ్వంర్యంలో అడ్డుకుంటామని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రజలతో దోబూచులాడుతున్నారని ఆరోపించారు. చర్చల పేరిట ఢిల్లీకి పిలిపించి, ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం తెలంగాణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో నవంబర్ నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం మలివిడత ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనికి గాను గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను సమాయత్తం చేస్తున్నామని అన్నారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజాపూర్ణానందం, నేతలు సంతోష్‌రెడ్డి, సహదేవ్, రమేశ్, గురువయ్య, మేరకిషన్, ఏలియా, అజ్మత్, అరుణ్, రాజేశ్వర్, సుదర్శన్, దేవన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణాలో పాదయాత్ర చేయాలనుకునే పార్టీల నేతలు ముందుగా ప్రత్యేక రాష్ట్రం విషయంలో స్పష్టమైన
english title:
s
Date:
Wednesday, October 24, 2012