నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 23: కలెక్టరేట్ కార్యాలయానికి భద్రత విషయంలో నెలకొన్న సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. దసరా పండుగ తర్వాత ఐదుగురు హోంగార్డులను కలెక్టరేట్ వద్ద భద్రతకు వినియోగించేందుకు ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఒక హెడ్‌కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ కలెక్టరేట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి ఎఆర్ కానిస్టేబుళ్లు, మరో ఐదుగురు హోంగార్డులు డ్యూటీలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, గత తెలంగాణ ఉద్యమ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ కార్యాలయానికి అదనంగా 25మంది సెక్యూరిటీ గార్డులను అప్పటి ఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఏర్పాటు చేశారు. హోంగార్డులుగా ఎంపిక అయ్యేందుకు కాస్త తేడాలో ఉద్యోగ అవకాశం కోల్పోయిన వారిపై సానుభూతితో గత కలెక్టర్ వరప్రసాద్ సిఫారసు మేరకు 25మందిని సెక్యూరి గార్డులను 2010వ సంవత్సరంలో నియమించారు. అప్పటి నుండి వారికి జాతీయ పొదుపు సంస్థకు వచ్చే కమీషన్ మొత్తాల నుండి వేతనాలు చెల్లిస్తూ వచ్చారు. జిల్లా కలెక్టర్‌గా వరప్రసాద్ స్థానంలో నియమితురాలైన క్రిస్టీనా జడ్ చోంగ్తూ ఇటీవలే సెక్యూరిటీ గార్డులను తొలగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. వేతనాలను పోలీసు శాఖ తరఫున చెల్లిస్తే వారిని విధులు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఎస్పీకి ప్రాతిపదనలు పంపారు. ఈ ప్రాతిపదనలకు ఎస్పీ ససేమిరా అనడంతో 25మంది సెక్యూరిటీ గార్డులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే ప్రతి రోజు ఆందోళనలు, కలెక్టరేట్ ముట్టడి దృష్ట్యా కలెక్టరేట్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత జిల్లా పోలీసు శాఖపైనే ఉన్నందున ఎస్పీ దీనిపై పరిశీలన జరిపి ఐదుగురు హోంగార్డులను భద్రతకు వినియోగించేందుకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీంతో గత పక్షం రోజులుగా కలెక్టరేట్ భద్రతపై కొనసాగుతున్న చర్చకు ఎట్టకేలకు తెరపడింది.
....................
ఆరు మాసాలుగా అందని వేతనాలు
కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో దసరా ఘోష
నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 23: వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారికి దసరా పండుగ సంబరాలు లేకుండా చేసింది. గత ఆరు మాసాలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ బకాయి వేతనాలు అందించాలని సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న దసరా పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశానికి బాధిత కుటుంబాలు నోచుకోలేకపోయాయి. కొందరు అప్పులు చేసి పండుగను జరుపుకునేందుకు సిద్ధం కాగా, మరికొందరు అప్పు పుట్టక పండుగ సంబరాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో దాదాపు 20వేలకు పైగా నిరుద్యోగులు గత కొంతకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ హోదాలలో ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. వీరికి వారివారి హోదాను బట్టి ప్రతి నెల వేతనాలు చెల్లించాల్సి ఉంది. గతంలో అనేక పర్యాయాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఆందోళనలు సైతం చేపట్టారు. కనీసం పండుగ బోనసు అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ వారికి ప్రభుత్వపరంగా ఎలాంటి హమీ లభించకపోగా, అసలుకే ఎసరు వచ్చింది. గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం వారిలో తీవ్ర నైరాశ్యాన్ని మిగిల్చింది. కంప్యూటర్ టీచర్‌లుగా, విద్యావాలంటీర్‌లుగా, పారిశుద్ధ్య కార్మికులుగా, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశవర్కర్‌లు, ఆయూష్ ఉద్యోగులుగా వివిధ రకాల ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చిరు ఉద్యోగులుగా తక్కువ వేతనాలకు పనిచేస్తున్న వారి జీవితాలు మరింత దయనీయంగా తయారయ్యాయి. వేతనాలు విడుదల చేయాలంటూ అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీసిన అధికారులు, చివరకు పండుగ సమీపించడంతో చేతులు ఎత్తేశారు. ఇప్పటికే ధరల పెరుగదలతో సతమతమవుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు దీనికి తోడు వేతనాలు అందక పండుగను ఎలా జరుపుకోవాలంటూ మనోవేదనకు గురవుతున్నారు.
కలెక్టరేట్ కార్యాలయానికి భద్రత విషయంలో నెలకొన్న
english title:
c
Date:
Wednesday, October 24, 2012