వరంగల్, అక్టోబర్ 23: సద్దుల బతుకమ్మ పర్వదిన సంబరం ఓరుగల్లులో అంబరాన్ని తాకింది... పూతోటలన్నీ ఒకచోట కొలువుదీరినట్లుగా నగరం కాంతులీనింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా నిలిచే సద్దులబతుకమ్మ పండుగను వరంగల్ జిల్లా ప్రజలు మంగళవారం ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలకు ముక్తాయింపుగా ఆడపడుచులు సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేయగా.. మరోవైపుదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు భైరవి అవతారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. ఎనిమిది రోజుల కిందట అమావాస్యరోజు శ్రీకారం చుట్టుకున్న బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకున్న మహిళలు నేడు చెరువుల్లో నిమజ్జనం చేశారు. ‘మాతల్లి బతుకమ్మ.. పోయి రావమ్మా.. గౌరమ్మా’ అంటూ మహిళల మంగళహారతుల నడుమ సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. తమ మాంగల్యాన్ని కాపాడాలని వేడుకుంటూ మహిళలు బతుకమ్మను కీర్తించారు. సంప్రదాయసిద్దంగా లభించే గునుగు, తంగేడు, బంతి, గుమ్మడి, సన్నజాజి, సీత జడ తదితర పూలను సేకరించి వాటికి రంగులద్ది అందంగా సిబ్బిలలో బతుకమ్మను అలంకరించారు. ఉదయం ఇళ్లల్లో పూజలు నిర్వహించి సాయంత్రం చిన్నా, పేదా తేడాలేకుండా ఆలయాలకు బయలుదేరారు. బతుకమ్మలను నెత్తిన పెట్టుకుని అంతా ఒక క్రమపద్దతిలో బయలుదేరడం శోభాయాత్రను తలపించింది. ఒకరికి పోటీగా మరొకరు చిన్నసైజునుండి భారీ సైజు వరకు బతుకమ్మలను తయారుచేశారు. వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి ఆలయం, వేయిస్తంభాల దేవాలయం, సిద్దేశ్వర, పద్మాక్షి ఆలయం, ఉర్సు రంగలీలా మైదానం, ఖిలావరంగల్ మెట్టుదర్వాజ, చిన్నవడ్డేపల్లి చెరువుల్లో మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మను కీర్తించారు. పట్టుచీరెల ధగధగలు..హోరెత్తించే బతుకమ్మ పాటలతో ఆలయాలు క్రొంగొత్త శోభతో వెలిగిపోయాయి. కీర్తనల అనంతరం ముత్తయిదువలకు పసుపు, కుంకుమలు ఇవ్వడంతోపాటు మహిళలు తమ వెంట తెచ్చుకున్న నువ్వులు, కొబ్బరి, పల్లీలు, చక్కెర తదితర మిశ్రమాలతో కూడిన పొడులను వాయినాలుగా ఇచ్చుకున్నారు. అనంతరం పద్మాక్షి చెరువు, భద్రకాళి చెరువు, చిన్నవడ్డేపల్లి, ఉర్సు రంగలీలా మైదానం, ఖిలావరంగల్ మెట్టుదర్వాజ చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. గత ఏడు మాదిరిగానే ఈ పర్యాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా జిల్లాకు విడుదల చేసిన లక్షరూపాయలను ఏర్పాట్లకోసం అధికార యంత్రాంగం ఖర్చుచేసింది. బతుకమ్మల నిమజ్జనం సందర్భంగా హన్మకొండ పద్మాక్షి చెరువుప్రాంగణం, వరంగల్ భద్రకాళి ఆలయ ప్రాంగణం, ఉర్సు రంగలీలా మైదానం, ఖిలావరంగల్ మెట్టుదర్వాజ తదితర ప్రాంతాలలో ఇసుక వేస్తే రాలనంతగా వేలాది మహిళలతో నిండి కనువిందుచేసింది.. విద్యుత్ దీపాల వెలుగులు దశదిశలా కాంతులీనాయి.. మహిళలు ఆలయాలకు బయలుదేరే సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. సాఫీగా వేడుకలు జరిగేలా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మగవారిని ఆయా ప్రాంతాలలో జరిగిన సద్దులబతుకమ్మ వైపు అడుగుపెట్టనీయకుండా చూశారు. మహిళలు ఆభరణాలు చోరీ జరగకుండా దొంగలపై నిఘావేశారు.
ఆలయాల్లో శరణుఘోష...
మరోవైపుఅమ్మవారి ఆలయాలు భక్తుల శరణుఘోషతో మార్మోగాయి. వరంగల్ నగరంలో భక్తుల కొంగుబంగారంగా కొలువుదీరిన భద్రకాళి అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. దుష్టులను అంతమొందించేందుకు ఎనిమిది చేతులతో సింహంపై అధిష్టించి భక్తులను కనువిందుచేశారు. వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి ఆలయం ఉదయంనుండి రాత్రివరకు కిటకిటలాడింది.
సద్దుల బతుకమ్మ పర్వదిన సంబరం ఓరుగల్లులో అంబరాన్ని తాకింది...
english title:
a
Date:
Wednesday, October 24, 2012